Sunday, April 3, 2011

ఆటా-'మజా'కా!


  • లీటర్ల కొద్దీ మత్తు... బెట్టింగ్‌లతో చిత్తు 
  • ముంబైలో1.8 లక్షలు, హైదరాబాద్‌లో 2 లక్షల లీటర్ల మద్యం తాగేశారు! 
  • విజయానంతర ర్యాలీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రమాదాల్లో 350 మందికిపైగా గాయాలు
హైదరాబాద్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ను రాష్ట్రంతో పాటు దేశమంతా ఆస్వాదించింది. ఆమాటకొస్తే పోటీపడ్డ భారత్‌-శ్రీలంకల్లోనే కాదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంకల్లో అయితే ఈ మ్యాచ్‌లో ప్రతి బాల్‌ను, పరుగును ఊపిరిబిగబట్టి చూశారు. కులాలు, మతాలు, ప్రాంతీయ భేదభావాలు, దక్షిణ, ఉత్తర భారతాలన్న తేడాలేవీలేకుండా ప్రతిఒక్కరు ఈ మ్యాచ్‌ను చూడటంలో తలమునకలయ్యారు. భారత్‌లో జాతీయస్ఫూర్తి వెల్లివిరిసింది.దేశాభిమానం ఉప్పొంగింది. భారత్‌ నెగ్గడంతోనే అందరిలోను ఉద్విగ్నత చోటు చేసుకుంది. మ్యాచ్‌ మొదలైన దగ్గర నుంచి పురుషులు, మహిళలన్న తేడాల్లేకుండా అందరూ కలసికట్టుగానే మ్యాచ్‌ను చూశారు. సచిన్‌, సెహ్వాగ్‌లు అవుటవడంతో ఇక విజయావకాశాలు సన్నగిల్లాయని కొందరు భయపడ్డా చివరివరకు భారత టీమ్‌ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఉత్తమ ఆటను రుచిచూపించింది. వరల్డ్‌కప్‌ సాధించి జాతికందించింది. వెస్టిండీస్‌లో వరల్డ్‌కప్‌ గెలిచిన 28 ఏళ్ల అనంతరం 120 కోట్ల భారత ప్రజల కలల్ని నెరవేరుస్తూ సొంతగడ్డపై కప్పును కైవసం చేసుకుంది.
ఈ విజయాన్ని.. అంతకుముందు మ్యాచ్‌ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆస్వాదించారు. యువకులు మద్యపానంలో తలమునకలయ్యారు. శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక్క ముంబయ్‌ నగరంలోనే 1.80 లక్షల లీటర్ల మద్యాన్ని తాగేశారు. ఇది ఇతర రోజుల్లోని వినియోగంతో పోలిస్తే 400 శాతం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌ యువకులు ముంబయ్‌ రికార్డును దాటేశారు. హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల లీటర్ల మద్యాన్ని ఒక్క శనివారం రాత్రే వినియోగించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాలు, పట్టణాలన్నింటిలో అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ తెరపై ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించిన క్రీడాభిమానులు కూడా బీర్‌, లిక్కర్లను పెద్ద సంఖ్యలోనే వినియోగించారు. సాఫ్ట్‌ డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్స్‌ తరహాలో లిక్కర్‌ను స్టేడియంలో అనధికారికంగా విక్రయించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విచ్చలవిడి మద్య విక్రయాలపై పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరించారు. పబ్లిక్‌ స్థలాల్లో మద్యం వినియోగాన్ని చట్టం కఠినంగా నిషేధిస్తున్నప్పటికీ ఇండో-పాక్‌ సెమీఫైనల్స్‌, ఇండో-శ్రీలంక ఫైనల్స్‌ అనంతరం ఈ నిషేధాల్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. భారత్‌ జయహో.. ఇండియా విన్స్‌ద కప్‌.. కమాన్‌ ఇండియా అంటూ బైక్‌లపై ర్యాలీలు చేసిన లక్షలాది మందిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 350 మంది వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలకు గురయ్యారు. వీరంతా ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
రాష్ట్రంలో వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ సందర్భంగా సుమారు 1200 కోట్ల విలువైన బెట్టింగ్‌ జరిగినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల్లో కొందరు లబ్ధి పొందితే మరికొందరు తీవ్రంగా నష్టపోయారు. బెట్టింగ్‌ల్ని అరికట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పేకాట తరహాలో బెట్టింగ్‌ ఫంటర్స్‌ను పట్టుకునే వీల్లేకుండా పోయింది. బెట్టింగ్‌ అంతా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సాగింది. విదేశాల్లోని పాక్‌,శ్రీలంక, భారత్‌ విద్యార్థులంతా ఒకే గదిలో కూర్చుని స్నేహితులుగా వరల్డ్‌ కప్‌
ఫైనల్స్‌ను చూసి ఒకరినొకరు అభినందించుకోవడం అంతర్జాతీయ క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఇటీవల కాలంలో ప్రపంచాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన సంఘటనలు మరేవీలేవు. సాకర్‌ ఐరోపా దేశాల్లో, బాస్కెట్‌బాల్‌ యుఎస్‌లో ప్రజాభిమానం పొందితే ప్రపంచంలోని అన్ని దేశాల్లోను క్రికెట్‌ అమితమైన ఆదరణ చూరగొంది. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో మొదలైన క్రికెట్‌పై సుమారు 200 ఏళ్లపాటు ఇంగ్లాండ్‌ పాలకుల బానిసత్వం కిందమగ్గిన భారతీయులు ఆధిపత్యం సాధించారు. క్రికెట్‌పై బ్రిటీషీయుల పెత్తనానికి తెరదించారు.

No comments:

Post a Comment