Sunday, April 10, 2011

అయ్యారే చిత్రం, హజారే విజయం


ఉన్నత స్థాయిలో అవినీతిని అంతమొందించేందుకు జన లోక్‌పాల్‌ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీసుకుని రావాలన్న డిమాండ్‌పై సంఘ సేవకుడు, గాంధేయవాది అన్నా హజారే జరిపిన నిరశన దీక్ష ఫలించడం ప్రజాస్వామిక వాదుల విజయం. ఆయన ప్రతిపాదించిన ఐదు డిమాండ్లలో నాల్గింటిని ప్రభుత్వం అంగీకరించడంతో నిరాహార దీక్ష విరమణకు మార్గం సుగమం అయింది. ముఖ్యంగా, ఇందుకు సంబంధించిన బిల్లు రూపకల్పనకు పౌర సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలన్న మొదటి డిమాండ్‌ని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఆమోదించడం ఆయన సాధించిన తొలి విజయం. నాలుగు రోజులుగా ఆయన జరుపుతున్న నిరాహార దీక్షకు దేశంలోని వివిధ వర్గాల నుంచే కాక,విదేశాల్లో స్థిర పడిన ప్రవాస భారతీయుల నుంచి అపూర్వమైన రీతిలో మద్దతు లభించడంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. దేశంలోని పలు నగరాలూ,ప్రధాన పట్టణాల్లో హజారేకి మద్దతుగా ర్యాలీలూ, ప్రదర్శనలూ, మానవహారాలు నిర్వహించడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. అంతేకాక, తాను బాగానే ఉన్నాననీ, ప్రజల్లో చైతన్యమే తన బలమని హజారే చెబుతున్నప్పటికీ, ఏడు పదుల వయస్సు దాటిన ఆయన ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం కావడంతో ఆయన డిమాండ్లపై యూపీఏ ప్రభుత్వ పెద్దలు తక్షణ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైంది. దాంతో హజారే ప్రతిపాదించిన డిమాండ్లలో ప్రధానమైన బిల్లు రూపకల్పనకు ఏర్పాటయ్యే ఉమ్మడి కమిటీకి మంత్రితో పాటు పౌర సంఘాల నుంచి ఉద్యమ నాయకులు ప్రతిపాదించే వ్యక్తిని కూడా చైర్మన్‌గా నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఈ కమిటీకి ఇద్దరు చైర్మన్లు ఉంటారన్న మాట. అంతేకాక, ఈ కమిటీ ఏర్పాటుపై నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం అంగీకరించింది. హజారే నేతృత్వంలో సాగిన ఉద్యమం సాధించిన ముఖ్యమైనశ విజయం ఇది. నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం అంగీకరించడంతో ఇది ఆషామాషీది కాదు, దీనికి చట్టబద్దత ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలన్న హజారే డిమాండ్‌ అంతరార్థం ఇదే.
బిల్లు రూపకల్పన కమిటీ చైర్మన్‌గా తనను ఉండమని ప్రభుత్వం కోరినా హజారే ససేమిరా అన్నారు. రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ సంతోష్‌ హెగ్డె, జస్టిస్‌ వర్మలలో ఎవరో ఒకరిని నియమించాలని ఆయన కోరుతున్నారు. ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని మాత్రమే చైర్మన్‌గా నియమిస్తామని చివరి వరకూ పట్టుబట్టిన కేంద్రం, ఇప్పుడు ప్రణబ్‌తో పాటు హజారే సూచించే పౌర సంఘం ప్రతినిధికి కూడా అధ్యక్ష హోదా కల్పించనున్నది. కీలకమైన సమస్యలపై ప్రణబ్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇప్పటికే 30 నుంచి 40 కమిటీలను ఏర్పాటు చేసింది.వాటిలో తెలంగాణా కమిటీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి మొక్కుబడి కమిటీగా ఉమ్మడి కమిటీ మిగిలి పోతుందేమోనని చైర్మన్‌ పదవిని పౌర సంఘం ప్రతినిధికి ఇవ్వాలని హజారే పట్టుపట్టి చివరికి సాధించారు.
తన ఉద్యమానికి రాజకీయ రంగును ఎవరూ పులమకుండా హజారే మొదటి నుంచి జాగ్రత్త పడ్డారు. తనకు సంఘీభావం తెలుపుతూ తనతో పాటు నిరశన దీక్ష జరిపేందుకు ముందుకు వచ్చిన వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులను ఆయన వెనక్కి పంపివేశారు. ఈ విషయంలో ఆయన నిష్కర్షగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల ఆయన వెనుక ఎవరో ఉన్నారని మొదట అనుమానించిన ప్రభుత్వం రెండవ రోజే స్వరం మార్చింది. తన నిరశన దీక్షపై ప్రజలను పెడతోవ పట్టించవద్దని హజారే ప్రధానికి ఘాటైన పదజాలంతో లేఖ రాయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రులు ప్రణబ్‌, కపిల సిబాలలతో పలు మార్లు సమావేశమై చర్చ జరిపారు. పరిస్థితి చేజారి పోతుందేమోనన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో కనిపించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారంనాడు రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవీసింగ్‌ పాటిల్‌ని కలుసుకుని 35 నిమిషాల సేపు చర్చలు జరపడం ఇందుకు నిదర్శనం. జన లోక్‌పాల్‌ చట్టాన్ని తీసుకుని వస్తే యూపీఏకి సంపూర్ణ సహకారం అందిస్తామని ఇప్పుడు గంభీర ప్రకటనలు చేస్తున్న బిజెపి వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇందుకు సంబంధించిన బిల్లును అటకెక్కించారు. లోక్‌పాల్‌ బిల్లు 1968లో తొలిసారిగా ప్రతిపాదనకు వచ్చి 1969లో బిల్లు రూపాన్ని తీసుకుని పార్లమెంటులో ప్రతిపాదనకు నోచుకుంది. కానీ ఆమోదం పొందలేదు,ఇదే రీతిలో ఈ బిల్లు 12 సార్లు మురిగి పోయింది. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఆమోదం కోసం యూపీఏ ప్రభుత్వం గడిచిన ఆరేడేళ్ళ నుంచి ఎంత ప్రయత్నించినా ఇంత వరకూ లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయింది. ఇదే పద్దతిలో ఈ బిల్లుపై కూడా మొక్కుబడి తతంగం నడిపిద్దామనుకున్న యూపీఏ పెద్దలు హజారే దృఢ వైఖరితో ఇంకా దిగి రాక తప్పలేదు. హజారేకు దేశ,విదేశాల్లో అపూర్వమైన రీతిలో మద్దతు లభించడం ప్రభుత్వానికి కొరబడలేదు.మరో వంక హజారే స్ఫూర్తితో దేశమంతటా అవినీతి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం అయింది. ఇప్పటి వరకూ ఇలాంటి ఉద్యమాలు, ఆందోళనలను పట్టించుకోని కార్పొరేట్‌ సంస్థల అధిపతులు సైతం హజారేకి మద్దతు ప్రకటించడం గమనార్హం.
లోక్‌పాల్‌ బిల్లు కోసం గతంలో ఎంతో మంది ఆందోళనలు సాగించినా, హజారే మాదిరిగా ఉడుంపట్టు ఎవరూ పట్టలేదు.నల్లధనం, అవినీతి, కుంభకోణాల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చేత పలుమార్లు మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే హజారే ప్రధాన డిమాండ్లకు తలొగ్గింది. ముమ్మాటికీ ఇది ప్రజాస్వామిక విజయం.

No comments:

Post a Comment