- గో.పి.లను ఆకర్షిస్తున్న జగన్ ఆర్థిక వనరులు
- సొంతబలం పెంచుకోవడంకంటే ఫిరాయింపులకే ప్రాధాన్యమిస్తున్న జగన్
- కృష్ణాజిల్లా తెదేపా కుమ్ములాటల్లో జగన్ పాత్రపై సందేహాలు
- జగన్‌కు స్ఫూర్తినిస్తున్న 2004, 2009లో వైఎస్ అనుసరించిన 'ఆకర్ష్' ఫార్ములా
హైదరాబాద్: జగన్ ఆర్థిక వనరులు రాష్ట్ర రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆయన ప్రాపకం పొందితేచాలు... కుబేరులు కావచ్చన్న ఆకాంక్ష వారిలో తొంగిచూస్తోంది. 2004 తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ సమీకరణాల మార్పులు, పార్టీల్లో అంతర్గత వివాదాలు, చీలికలు ఇలా అన్నింట్లోనూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో దివంగత వైఎస్, ఆయన కుమారుడు జగన్‌ల ప్రమేయం స్పష్టమౌతోంది. తాజాగా తెలుగుదేశం కృష్ణాజిల్లా అంతర్గత కుమ్ములాటల్లో కూడా జగన్ పాత్రపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కృష్ణా తెలుగుదేశంలోని ఓ వర్గం జగన్ శిబిరంలో చేరాలని అందుకోసం తెలుగుదేశం పార్టీ నుంచి ఏదోవిధంగా బహిష్కృతులయ్యే లక్ష్యంతోనే ఈ వివాదానికి తెరతీసినట్లు పరిశీలకులు అనుమానిస్తున్నారు.
స్వపక్షాన్ని బలపర్చుకోవడమే కాదు. విపక్షాల్ని నిర్వీర్యం చేయడం ద్వారానే అధికారాన్ని ఏకపక్షంగా కొనసాగించే వీలుంటుందని వైఎస్‌ఆర్ విశ్వసించారు. ఆయన మార్గాన్నే జగన్ కూడా అనుసరిస్తున్నారు. 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష పథకాన్ని అమల్లో పెట్టేశారు. టిడిపి, టిఆర్‌ఎస్ నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికారానికి, ప్రలోభాలకు దాసోహమయ్యే వారిని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. టిఆర్‌ఎస్‌కున్న 26 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని ఆకర్షించారు. వారంతా ఆ పార్టీలో కొనసాగుతూనే అధిష్టానంపై తిరుగుబాటు చేసేలా వ్యూహాల్ని అమలు చేశారు. ప్రజల భావోద్రేకాలతో ఏర్పడ్డ టిఆర్‌ఎస్ ప్రధాన పాలనా భవనాన్ని కూడా వీరు తమ అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అసలైన టిఆర్‌ఎస్ తమదేనంటూ కెసిఆర్‌పైనే ధ్వజమెత్తారు. కెసిఆర్‌ను లోనికి రానిచ్చేదిలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వైఎస్ రాజకీయ అరంగేట్రం నుంచి ఇలాంటి పంథానే పాటించారు.
కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో ఏకపక్ష రాజకీయాలకు ఆయన తెరతీశారు. తన అనుమతి లేకుండా ఎవరూ కనీసం నామినేషన్ వేసే సాహసం కూడా చేయలేని విధంగా తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు. అలా ఆ ప్రాంతాన్ని ఫ్యాక్షనిస్ట్ కేంద్రంగా మార్చేశారు. ఆయన విధానాల్తో కడప జిల్లా వైఎస్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీలిపోయింది. ఆయన్ను ఎదిరించిన వారిలో పలువురు
హత్యలకు, దాడులకు గురయ్యారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కడప నుంచి హైదరాబాద్, కర్నాటకలకు పారిపోయారు. ముఖ్యమంత్రి కాగానే ఫ్యాక్షనిజానికి తెరదించుతున్నట్లుగా వ్యవహరించారు. గతాన్నంతా తాను మర్చిపోతానని, ఫ్యాక్షనిస్టులంతా తమ పద్ధతిని మార్చుకుని ప్రశాంత జీవితానికి అలవాటుపడాలంటూ ప్రతిపాదించారు.
ఇలా లొంగి దారికిరాని వారిపై అధికార అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత ఈ విధానాన్ని రాజకీయాల్లో అమలు చేయడం మొదలుపెట్టారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్‌పిల్ని విడగొట్టి ఆ పార్టీ భవిష్యత్‌పైనే సందేహాలు కల్పించారు. కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబుతో కలసి 2009లో పోటీకి దిగాల్సిన పరిస్థితి కల్పించారు. అలాగని ప్రధాన ప్రతిపక్షం టిడిపిని కూడా వైఎస్ వదిలిపెట్టలేదు.
విశ్వాస పరీక్షలో యుపిఎ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు టిడిపి ఎమ్‌పిలు మందా జగన్నాథం, ఆదికేశవుల నాయుడులను తనవైపు ఆకర్షించి బాబుకు షాకిచ్చారు. సోనియా ప్రశంసలు పొందారు. మందాకు మరోసారి ఎమ్‌పిగా అవకాశం కల్పించారు. ఆదికేశవులుకు ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్‌గిరి కట్టబెట్టారు. తెలుగుదేశం సీనియర్లు పలువురిని కాంగ్రెస్‌లో కలిపేసుకున్నారు.
2009లో మరోసారి ముఖ్యమంత్రైన తర్వాత కూడా ఈ ఆకర్ష్ పథకాన్ని కొనసాగించారు. టిడిపి మహిళా నాయకురాలు రోజాను కాంగ్రెస్‌లోకి నడిపించారు. టిఆర్‌ఎస్‌కున్న ఇద్దరు ఎమ్‌పిల్లో ఒకర్ని ఆకర్షించారు. మరోసారి టిఆర్‌ఎస్‌ను చీల్చే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ ఆకస్మిక మరణంతో ఈ ప్రణాళికలు అమల్లోకి రాలేదు. టిడిపి, టిఆర్‌ఎస్‌లకు చెందిన ఐదుగురు ఎమ్‌పిల్ని కాంగ్రెస్‌లో కలిపేస్తానని వైఎస్ హామీనివ్వడం వల్లే మన్నవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం అనుమతులిచ్చిందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. జగన్ కూడా సొంత బలాన్ని పెంచుకోవడం కంటే ఇతర పార్టీల నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని ఆకర్షించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ తన అధికారాన్నిందుకు వినియోగిస్తే జగన్ ఆర్థిక వనరుల్ని ఎరగా చూపుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొండా సురేఖ వంటి వార్ని కరడుగట్టిన తన అభిమానులుగా మార్చేసుకున్నారు. బోస్, బాలినేనిలు మంత్రి పదవుల్ని కూడా కాదని తనవైపొచ్చేలా ఆకర్షించారు. వీరితోపాటు కాంగ్రెస్‌లోని తన మిత్రులు, తన ఆర్థిక సహకారంతో ఎన్నికైన వారందర్ని తన పంచకు తెచ్చేసుకున్నారు. తాజాగా టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి, మంత్రి ధర్మాన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాసుల్ని కూడా తనవైపు తిప్పుకున్నారు. పిఆర్‌పికి చెందిన భూమా శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలు ఇప్పటికే జగన్ శిబిరంలో చేరారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులంతా జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. వీరే కాదు ప్రధాన పార్టీల్లో మరికొందరు అసంతృప్త నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా జగన్ ఆకర్షణకు లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
No comments:
Post a Comment