న్యూఢిల్లి: వెండి ధర ఇప్పట్లో 'కొండ' దిగివచ్చేలా లేదు. ఇటీవలి కాలంలో ఆల్‌టైం రికార్డుల మీద రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న వెండి ధర బుధవారం నాడు మరింతగా పెరిగింది. ధర అధికమైనప్పటికీ, ఆభరణాల తయారీదారులు, ట్రేడర్లు, స్టాకిస్టుల నుంచి కొనుగోలు మద్దతు తగ్గడం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ రాజధాని బులియన్ సెషన్‌లో కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 900 రూపాయలు పెరిగి 58,400 రూపాయలకు చేరింది. వెండి నాణాల ధర 1,500 రూపాయలు పెరిగి 65,000కు చేరింది. వారాంతపు డెలివరీ ట్రేడింగ్‌లో కిలోకు 715 రూపాయలు అధికంగా 57,815 రూపాయల ధర పలికింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 150 పెరిగి 21,300 రూపాయలకు, ఆభరణాల బంగారం ధర అంతే మొత్తం పెరిగి 21,180 రూపాయలకు చేరింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నవరాత్రోత్సవాల్లో అమ్మకాలు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్న ఆభరణాల తయారీదారుల అధిక కొనుగోళ్ళ దిశగా సాగుతున్నారని, గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు వెండి విషయంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. వెండి నాణాల అమ్మకాలు సంతృప్తికరంగా సాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1.55 శాతం పెరిగి 1,457.80 డాలర్లకు, వెండి ధర 1.79 శాతం పెరిగి 39.28 డాలర్లకు చేరింది.
No comments:
Post a Comment