ఒక క్షణమైనా ఆగకుండా నిరంతరంగా భ్రమిస్తున్న కాలాన్ని లెక్కించే పద్ధతులు ఆయా దేశ, ప్రాంత, మతాలపై ఆధారపడి వుంటాయి. విశ్వంలో ప్రస్తుతం కాలాన్ని లెక్కించుటకు సౌరమానం, చంద్రమానం, బృహస్పతి మానం, గ్రీకు మానంతోపాటు మరో అయిదు పద్ధతులు అమలులో కలవు. చంద్రమాన పద్ధతిలో కాలాన్ని లెక్కించునప్పుడు నూతన సంవత్సర ప్రారంభ రోజును ఆంధ్ర, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు యుగాదిగా జరుపుకుంటున్నారు. అయితే తమిళులు సౌరమానం ప్రకారం ఉగాదిని ప్రతి ఏటా ఏప్రిల్ 14న వైశాఖిపేరిట, కేరళలో ఓనం పేరిట, పార్శిలు ఆగస్టు 21న గుజరాతీలు దీపావళి మరుసటి రోజున, ఉత్తర భారతహిందువులు హాళి పౌర్ణమి తెల్లవారు జామున ఉగాదిగా జరుపుతారు. అలాగే గ్రీకు కాలమానం ప్రకారం ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి, హిజరి శకం ప్రకారం అరబ్బులు, ముస్లీంలు తమ నూతనసంవత్సరాన్ని మొహర్రం మాసపు తొలిరోజు నుండి జరుపుకుంటారు. తెలుగు, కన్నడ, మహారాష్ట్రులు అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమితో నూతన మాసాన్ని మొదలు పెట్టడంతో తొలుత శుక్లపక్షం, ఉత్తర భారతీయులు హాళీ పండగ మరుసటి రోజుతో నూతన సంవత్సరాన్ని
ఆరంభించడంతో వారికి తొలుత కృష్ణపక్షం వస్తుంది.
అందువల్ల దక్షిణాదిన ఫాల్గుణ కృష్ణ పక్షమైతే, ఉత్తరాదిన అది చైత్ర కృష్ణ పక్షం అవుతుంది. శుక్లా పక్షాలు మాత్రం సమాన కాలాన్ని సూచిస్తాయి. దీనివల్ల ఉత్తర భారతీయులు దక్షిణాది వారికంటే పేరులో మాత్రమే ఒక నెల ముందు వుంటుంది.
దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఒకే రోజు జరిపినప్పటికి ఉత్తరాదిన కార్తీక అమావాస్య అని, దక్షిణాన అశ్వయుజ అమావాస్య అని పిలుస్తారు. అలాగే కృష్ణాష్టమిని ఉత్తరంలో బాద్రపద కృష్ణాష్టమని, దక్షిణంలో శ్రావణ కృష్ణాష్టమని పిలుస్తారు. కాని శుక్ల పక్షంలో వచ్చే పండుగలు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకే పేరుతో పిలువబడుతాయి. శ్రీరామనవమి ఉత్తరం, దక్షిణాలలో కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరుపబడుతాయి.
చరిత్రలో యుగాది
'ఉడు' అనగా నక్షత్రం, గమనం అనగా నడక అను అర్థాలను అనుసరించి ఉగాది అనగా నక్షత్రాలు నడక ప్రారంభించిన సమయం. అదే సృష్టి నడక ఆరంభానికి సమయమైంది. సూర్య, చంద్ర గ్రహ నక్షత్రాది గమనంతో కాల గమన గణన ప్రారంభమవుతుంది. కాల పురుషుడైన సూర్యుడు కాలగతిని అనుసరించి సప్తాశ్వాలతో ఉదయించే తొలిరోజు యుగాదిగా పేర్కొనబడినది. కాల క్రమేణ యుగాది ఉగాదిగా రూపాంతరం చెందింది.
పురాణాల ప్రకారం బ్రహ్మ చైత్ర కృష్ణ పాడ్యమి రోజున సృష్టిని ప్రారంభించినట్లు కథనం. నాలుగు వేదాలను దొంగలించిన సోమకాసురిడిని మత్స్య అవతారం ఎత్తిన మహా విష్ణువు వధించి, చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాలలో పేర్కొనబడింది. కలియుగ ఆరంభంలో వరాహమిరుడు ఇదే రోజున పంచాంగాన్ని అవిష్కరించినట్లు కథనం కలదు. చారిత్రక కథనం ప్రకారం శాలివాహనుడు, చత్రపతి శివాజీలు ఇదే రోజున పట్టాభి షక్తులయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల ఉగాదికంటే తెలుగు ఉగాదికి ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. ఈ రోజున తెలుగు సంవత్సరాదితో పాటు, వసంత ఋతువు కూడ ప్రవేశిస్తుంది. మాసంలోని పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం పేరు ఆమాసానికి పేరుగా నిర్థారించారు. ఆ ప్రకారం తెలుగు సంవత్సరం చైత్రంలో మొదలై ఫాల్గుణంతో ముగుస్తుంది. ఒక సంవత్సరాన్ని ఆయానంగా, ఆయానాన్ని ఋతువులుగా, ఋతువును మాసాలుగా, మాసాన్ని పక్షం గా, పక్షాన్ని రోజులుగా విభజిం చారు. తెలుగు సం వత్సరాలు ప్రభవ నామం తో మొదలై అక్షయతో ముగుస్తాయి. 60 తెలుగు నామ సంవత్సరాలు గల చక్రంలో వికృత నామ సంవత్సరం 24వది. ఒక నామ సంవత్సరంలో జన్మిచిన వ్యక్తి తిరిగి అదే నామ సంవత్సరంలో జన్మదినాన్ని జరుపుకుంటే అతినికి షష్ఠీపూర్తి జరిగి నట్లుగా ప్రజలు వ్యహరి స్తారు. పురాణాల ప్రకారం ఈ సృష్టి కొన్ని లక్షల యుగాల క్రితం ఆరంభమైనట్లు తెలుస్తుంది.
యుగం-శకం ల వివరణ
సృష్టి ఆరంభం నుండి మన్వంతరానికి 43 కోట్ల 20 వేల సంవత్సరాల చొప్పున ఆరు మన్వంతరాలు గడిచి, ఎడవ మన్వంతరంకాని శ్వేత వరహకల్ప మహాయుగంలో ప్రస్తుతం కాలం సాగుతుచున్నది. కృత, త్రేత, ద్వాపర యుగాల పిదప కలియుగ ప్రధమ పాదంలో 5111వ సంవత్సరం నడుస్తున్నది. ఒక నిర్ధిష్ట సంఘటనతో ముడిపడి నిరంతరంగా లెక్కించబడే కాల ఖండాన్ని
శకం అంటారు. ఉజ్జయిని రాజధానిగా పాలించిన ప్రమర వంశీయుడైన విక్రమార్కుడు క్రీస్తు పూర్వం 57 సంవత్సరంలో పాశవిక రాక్షస లక్షణాలు గల జాతులపై సాధించిన విజయానికి శాశ్వత గుర్తుగా భారతీయులు కాలగమనంలో విక్రమార్కశకం అరంభమైంది. పిదప క్రీ.శ. 78లో చైత్ర మాస కృష్ణపక్ష పాడ్యమి రోజున విక్రమార్కుని మునిమనమడైన శాలివాహనుడు, శకులు అనే జాతిపై యుద్ధంచేసి వారు కోరుకోలేని విధంగా దెబ్బతీసి పొదిన విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. అలాగే క్రీస్తు పుట్టిన సంవత్సరం నుండి క్రీస్తు శకం, మహ్మద్ ప్రవక్తపుట్టిన నుండి హిజారి శకములు ప్రారంభమయ్యాయి. క్రీస్తు శకం ప్రకారం ప్రస్తు తం కలియుగం 5112, విక్రమశకం 2068, శాలివాహన శకం 1932, హిజారి శకం 1432 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఉత్తర భారత దశంలో విక్రమ శకం, దక్షిణాన శాలివాహన శకాలు పాటించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం శాలివాహన శకాన్ని జాతీయ శకంగా నిర్ణయించింది.
కాలమాన పద్ధతులు-సమన్వయం
భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించి నప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్ర నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు. చంద్రమాన ప్రకారం రూపొందించిన సంవత్సరానికి 355 రోజులు వస్తాయి. సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు. అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. 27 నక్షత్రాల సముహాలను 12 రాశులుగా వర్గీకరించి ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తారు. తొమ్మిది పాదాలలో సూర్యుడు ఉండే కాలాన్ని ఒక మాసంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో సూర్యుడు 12 రాశులలో నెలకో మారు చొప్పున గడుపు తాడు. ఈ విధంగా సూర్యుడు 27 నక్షత్రాలను చుట్టేసరికి సంవత్సరం పూర్తవు తుంది. దీనికి 365 రోజుల కొన్ని గంటలు పడు తుంది. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి. సౌరమాన సంవత్సరానికి, చంద్రమాన సంవత్స రానికి 11 రోజుల తేడా వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే 36 సౌర సంవత్సరాలు గడిచినప్పుడు 37 చంద్రమాన సంవత్సరాలు పూర్త అవుతాయి.
అలా జరిగితే కాల గణనం, ఋతు స్వభావం మారుతుంది. అందుకే భారత ఖగోళ పండితులు ప్రతీ మూడేళ్లకు ఒకసారి చంద్రమాన సంవత్సరానికి అదనపు నెలను కలిసి రెండు మాసాలను సమన్వయ పరిచారు. ఈ పద్ధతి ముస్లీంలు పాటించే హిజరి శకంలో లేకపోవడం వల్ల ప్రపంచానికంతటికి 36 ఏళ్లు వస్తే వారి లెక్కల్లో 37 ఏళ్లు వస్తాయి. అందుకే ఇస్లాం పండుగలు తొమ్మిదేళ్లపాటు అషాఢంలో వస్తే మరో తొమ్మిదేళ్లలో అవే పండగలు ఆశ్వయుజంలో వస్తాయి.
బృహస్పతి మానం ప్రకారం బృహస్పతి ఏడాదికో రాశిలో నివశిస్తుంటాడు. బృహస్పతి మారినప్పుడల్లా సంవత్సరం మారుతుంది. అలా బృహస్పతి 12 సంవత్సరాలలో 12 రాశులయందు పరిభ్రమిస్తాడు. దీనినే పుష్కర కాలం అని అంటుంటారు. బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగానది పుష్కరాలు (1999), వృషభరాశిలో నర్మదానది పుష్కరాలు (2000) మిధునరాశిలో సరస్వతీనది పుష్కరాలు (2001), కర్కాటక రాశిలో యుమన నది (2002), సింహరాశిలో గోదావరి పుష్కరాలు (2003) కన్యారాశిలో కృష్ణానది (2004), తులరాశిలో కావేరినది (2005), వృశ్చిక రాశిలో భీమరదీనది (2006), దనుస్సురాశిలో పుష్కరిణినది (2007), మకరరాశిలో తుంగభద్రనది (2008), కుంభరాశిలో సింధునది (2009) మీనారాశిలో ప్రణీతనది (2010) పుష్కరాలు నిర్వహిస్తున్నారు. సౌరమానం కాలం ను గణించడానికి, చంద్రమానం వ్యవహారానికి సౌలభ్యంగా వుంటాయి.
ఉగాది విశిష్టత-వసంత ఆగమనం
ఒక సంవత్సరం ముగిసి, మరో నూతన సంవత్సరం మొదలయ్యే ఉషోదయ వేళ వచ్చే ఉగాది తనతో పాటు వసంతాన్ని తీసు కొస్తుంది. హేమంత, శిశిర ఋతువులలో మోడువారిన చెట్లు వసంత ఋతువు రాకతో చిగురిస్తాయి. ఆమని ఆకుపచ్చని చీరను అపాదించుకున్నట్లుగా ప్రకృతి అంతా పచ్చగా వుండి కొత్త శోభలతో కళకళలాడుతు సుందరంగా కనిపిస్తుంది. విరబూసిన కుసుమాలచే ఆకర్షింపబడిన తుమ్మెదల ఝూంకారాలతో, లేత మావి చిగురు తిని కూసే కోయిల రాగాలతో, ప్రకృతి మనోల్లాసంగా వుంటుంది. ప్రకృతి ఆరాధనలో ఓ భాగంగా ఉగాది పండుగ జరుపుకొనబడుతున్నది. ఈ రోజును కన్నడీయులు యుగాదిగా, మహారాష్ట్రీలు గుడి పడవగా పిలుస్తారు.
ఉగాది పచ్చడి-సైన్స్ విశ్లేషణ
ఆరు రుచుల మిశ్రమాన్ని సంవత్సర ఆరంభం రోజు సేవిస్తే ఏడాది అంతా కష్ట, సుఖాలను సమాన పాళ్లలో అనుభవించవచ్చని ప్రజల నమ్మకం. అందుకే ఉగాది రోజున షడ్రుచులతో తయారైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారు. తీపిరుచిగల బెల్లం, కారంగా వుండే మిరియాలు, చేదు అయిన వేప, వగరుగల మామిడి, పులుపుగా వుండే చింతపండు, ఉప్పు పదార్థాల సమ్మేళంతో తయారైన మిశ్రమాన్ని జీవితంలోని ఆటుపోటులకు ప్రతీకగా భావిస్తారు. సైన్స్ ప్రకారం ఈ పచ్చడి వల్ల శరీరం లోని రుగ్మతలు తగ్గి ఆరోగ్యం చేకూరునని తెలుస్తుంది. వేపలోని చేదు వాతాన్ని, చింతపండులోని ఆవ్లుం కషాన్ని, మిరియాలు శ్లేషాన్ని, తీపి రక్తదోషాల్ని, తొలగిస్తాయని, మామిడిలోని విటమిన్ (సి), ఉప్పు శరీర సమతుల్యాన్ని కాపాడుతాయని సైన్స్ వివరిస్తుంది.
పంచాంగ శ్రవణం-ఫలితాలు
పంచ అంగములైన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణులతో రూపొందించబడిన పంచాంగాన్ని ఉగాది రోజున వింటే శుభం కలుగునని ప్రజల విశ్వాసం. తిధది వల్ల సంపద, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాప పరిహారం, యోగంతో ఆరోగ్యం, కరణంతో కార్యానుకూలత కలుగుతుంది. అందుకే ఉగాది రోజున సాయంత్రం అలయ మంటపాలలో ప్రంచాంగ శ్రావణం నిర్వహించబడుతుంది. ప్రతీ సంవత్సరం నవ నాయకులు ఆధీనంలో పాలించబడుతుంది. వీరందించే ఫలితాన్ని రాజాదినవ నాయక ఫలం అని అంటారు.
- ముడారపు పరమేశ్వర్
No comments:
Post a Comment