హైదరాబాద్: ఉపకారవేతనాలు, బోధనా ఫీజుల చెల్లింపు పథకం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్ధులు కోర్సుల్లో ప్రవేశ సమయంలో బయోమెట్రిక్ హాజరు పద్దతిని ప్రవేశపెడుతున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ పద్దతి వలన విద్యార్ధి సంబంధిత కళాశాలలో చదువుతున్నాడో లేదనే విషయం స్పష్టంగా నిర్ధారణ అవుతుందన్నారు. విద్యార్ధుల హాజరు బయోమెట్రిక్ పద్దతిని కళాశాలలు తప్పనిసరిగా పాటించాలని అదేశిస్తామన్నారు. బోధనా ఫీజులు కేవలం డిగ్రీ విద్యార్ధులకు మాత్రమే చెల్లించి, పీజి కోర్సులు అభ్యసించే బడుగు విద్యార్ధులకు చెల్లించకుండా ప్రభుత్వం మెండిచెయ్యి చూపిస్తుందంటూ మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ఆయన కొట్టిపరేశారు. మీడియాలో వచ్చే కథనాలు చూసి విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదని, పిజీ విద్యార్ధులకు బోధనా ఫీజులు చెల్లింపు విషయంలో ప్రభుత్వం వెనుకంజవేయబోదని, అర్హులైన అందరికి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ పేద విద్యార్ధి ఉన్నత చదువులు కొనసాగించాలనే ఉద్దేశంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో బోధనా ఫీజులు చెల్లింపు, ఉపకారవేతనాలు పథకాన్ని ప్రవేశపెట్టామని, ఈ పథకాన్ని కొనసాగింపులో తమ ప్రభుత్వం రాజీపడదన్నారు. బుధవారం సచివాలయంలో బోధనా ఫీజులు చెల్లింపు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్ధసారధి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి విద్యాసాగర్, బిసి సంక్షేమశాఖ కార్యదర్శి హిరాలాల్ సమారియా, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మీ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ శాంతికుమారి తదితర అధికారులు పాల్గొని చర్చించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, 2009 -10 విద్యా సంవత్సరంలో ఉపకారవేతనాలు, బోధనా ఫీజులను ఒక్కో విద్యార్ధి రెండుసార్లు పొందుతున్న విషయం బయటపడిందని, అలా రెండుసార్లు లబ్ధి పొందిన విద్యార్ధుల వద్ద తిరిగి వసూలు చేశామన్నారు. 2010 నుంచి ఉపకారవేతనాలు మంజూరు ప్రక్రియలో ఐటి ఆధారిత టెక్నాలజీ ప్రవేశపెట్టడం వలన అక్రమాలు బయటపడటమే కాకుండా లబ్ధిపొందుతున్న విద్యార్ధుల డేటా అంతా ప్రభుత్వం వద్దనే ఉందన్నారు. 2010 -11 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా మార్చి 31 నాటికి రూ.1000 కోట్లు చెల్లించామని, ఏప్రిల్ 31 నాటికి మరో వెయ్యికోట్ల రూపాయలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. జూలై 30 నాటికి ఉపకారవేతనాలు బకాయిల మొత్తం చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. 2009 -10 సంవత్సరానికి సంబంధించి రూ.2100 కోట్లు, ఈ ఏడాది మరో వెయ్యికోట్ల రూపాయలు చెల్లించామన్నారు. పారామెడికల్ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ జూలై, ఆగస్టు నాటికల్లా పూర్తి చేయాలని వైద్యశాఖకు మార్గదర్శకాలు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అత్యధిక కళాశాలల్లో తగిన బోధనా సిబ్బంది, మౌలిక సధుపాయాల కొరత ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై ఉన్నతవిద్యశాఖ ముఖ్య కార్యదర్శితో కూడిన మోనేటరింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ వయోపరిమితి పెడుతుందని, అదే తరహాలో ఉపకారవేతనాలు, బోధనా ఫీజులు పొందేందుకు వయోపరిమితిని విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. 39 సంవత్సరాల వయస్సు దాటిన విద్యార్ధులు ఉపకారవేతనాలు, బోధనా ఫీజులు పొందేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బలహీన వర్గాల విద్యార్దులకు ఉద్యోగవకాశాలు కల్పించాలనే ఉద్యేశంతో ఫీజురీఇంబర్స్‌మెంట్, ఉపకారవేతనాల పథకాన్ని కొనసాగిస్తున్నామని, అయితే ఈ ఏడాది 70 సంవత్సరాల వయస్సు పైబడిన వ్యక్తులు ఉపకారవేతనాలు, ఫీజురీఇంబర్స్‌మెంట్ పొందుతున్నట్లు తేలడంతో నివ్వెరపోయమన్నారు. 70 సంవత్సరాల వయస్సు పైడిన వారు 51 మంది, 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు గలవారు 25 మంది, 56 నుండి 60 వయస్సు మధ్యనున్నవారు 36 మంది, 46 నుండి 50 మధ్య వయస్సు కలిగిన వారు 181 మంది, 41 నుండి 45 వయస్సు మధ్యనున్న వారు 783 మంది ఉపకారవేతనాలు పొందారని మంత్రి పితాని తెలిపారు.
No comments:
Post a Comment